. 2 minutes

ఆధ్యాత్మికం: మౌనమే విజయానికి కీలకం…

Caption of Image.

సరిగ్గా మాట్లాడటం ఎంత కష్టమో, మౌనంగా ఉండటమూ అంతే కష్టం. అది మనసుకు సంబంధించిన భాష. వాక్కు అసలు పలకకపోవడం మౌనం కాదు. వాక్కును నియంత్రించడం మౌనం. అది ఒక యోగం, ఒక యాగం, సకలభాషలూ సమ్మిళితమైన విశ్వభాష.

 మౌనంగా ఉంటే  ఏదైనా సాధించవచ్చు. మౌనం  చాలా శక్తివంతమైన ఆయుధంగా ఉపయోగపడుతుంది. మాటల ద్వారా సాధించలేనిది మౌనం ద్వారా సాధించవచ్చు మౌనంగా ఉండటం వల్ల ఎదుటివారి మాటలు, భావాలు బాగా వినడానికి, అర్థం చేసుకోవడానికి అవకాశం ఉంటుంది. 

అన్ని వైపుల నుంచీ సమున్నతమైన భావాలను, ఆలోచనలను ఆత్మీయంగా ఆహ్వానించమంటుంది రుగ్వేదం. అలా చేయాలంటే మౌనాన్ని ఆచరించడం ఎంతో ముఖ్యమని చాణక్యుడు చెబుతున్నారు. అలా మౌనంగా ఉన్నవాడే ఎప్పుడూ ప్రశాంతతను పొందగలడని ఆయన అంటున్నారు. 

మౌనంలో  ఎంతో మహత్తరశక్తి  ఉంది.  మాట్లాడటం వెండి అయితే.. మౌనం బంగారం అంటారు. మితంగా మాట్లాడటమూ మౌనమే అని చెబుతోంది మహాభారతం. హితంగా, మితంగా మాట్లాడలేకపోతే మౌనమే మేలని విదురనీతి ద్వారా తెలుస్తోంది. మౌనం మాట్లాడినంత తీయగా … మరే భాషా మాట్లాడలేదు. మాటలకు అందని కమ్మని భావాలు మౌన భాషకు ఉంటాయి. 

విమర్శలు వచ్చినప్పుడు వెంటనే ప్రతిస్పందించకుండా మౌనంగా ఉండి, వారి మాటలు పూర్తిగా విని, ఆ తర్వాత ఆలోచించి సమాధానం ఇవ్వాలి. ఇది మిమ్మల్ని మరింత ప్రశాంతంగా, తెలివిగా కనిపించేలా చేస్తుంది.అవసరం లేని విషయాల్లో జోక్యం చేసుకోకుండా, మౌనంగా ఉండటం వలన అనవసర వివాదాలకు, గొడవలకి దూరంగా ఉండేందుకు మౌనం ఎంతగానో ఉపయోగపడుతుంది. 

మౌనం పట్ల విశ్వాసం, గౌరవం ఉన్నవాళ్లకే  మౌనం విలువ తెలుస్తుంది. ఆదిశంకరులు, విద్యారణ్యస్వామి, రామకృష్ణ పరమహంస, రమణమహర్షి, శ్రీ చంద్రశేఖర సరస్వతి స్వామి.. పలువురు ఆధ్యాత్మిక వేత్తలు,    మహనీయుల సందేశాలు, ఉపదేశాలు సాధకులకు మౌనం … మితంగా.. మాట్లాడడం వలన అంత శక్తిని సాధించారు. 

 మన సనాతన సంప్రదాయంలో మహానుభావులుగా చెప్పుకునే వారు  ప్రబోధాలను, ప్రవచనాలను మౌనంగానే ఆలకించి, అవగాహన చేసుకుని హృదయాల్లో నిక్షిప్తం చేసుకున్నారు. అలాంటి వారందరికీ మౌనసాధనే ప్రధాన సాధనమైంది.

పాపపరిహారార్థం నిర్దేశితమైన అయిదు శాంతుల్లో మౌనం ఒకటని పురాణాలు చెబుతున్నాయి. అవి- 1.జపం 2.మౌనం 3.పశ్చాత్తాపం 4.శాంతి 5.దానం

ALSO READ : ఆధ్యాత్మికం: కోరికలు అదుపులో లేకపోతే ఏం జరుగుతుంది.. శ్రీకృష్ణుడు చెప్పింది ఇదే..!

మౌనంగా ఉండటం వలన ఆలోచించడానికి, విషయాలను విశ్లేషించడానికి తగిన సమయం దొరుకుతుంది. దీనివల్ల సరైన నిర్ణయాలు తీసుకోవడానికి అవకాశం ఉంటుంది. మౌనంగా ఉండటం వలన ఒత్తిడి, ఆందోళన తగ్గుతాయి. మానసిక ప్రశాంతత లభిస్తుంది.అయితే, అవసరమైనప్పుడు ఎంతవరకు మాట్లాడాలో అంతవరకే మాట్లాడాలి. 

ఇతరులను బాధ పెట్టే విధంగా మాట్లాడటం…. పరుష వచనాలు పలకడం …. అబద్ధాలాడటం, చాడీలు చెప్పడం…  అసంబద్ధంగా ప్రేలాపనలు చేయడం- ఈ నాలుగూ  నోటినుంచి వచ్చే  దోషాలని  చెబుతారు. వీటన్నింటికీ పరిహారం మౌనం. మౌనవ్రతం వల్ల ఈ నాలుగు దోషాలూ దరి చేరవు. మౌనంగా ఉన్నప్పుడు మనసును ధ్యానానికి, వైరాగ్యానికి అంకితం చేసినట్లయితే  వారి జీవితానికి చరితార్థత ఏర్పడుతుంది. 

భగవంతుడికి అత్యంత ప్రీతిపాత్రమైన భాష మౌనమే. మనిషి మనుగడకు జీవనయాత్రకు శబ్దం ఎలా చోదక శక్తి అయిందో మౌనమూ అంతే! వినయం, శ్రవణం మౌనానికి అనుసంధానమైనప్పుడు.. అది విన్నవారికి  గ్రహించే శక్తి పెరుగుతుంది. పాండవుల పురోహితుడు ధౌమ్యడు ఉపదేశించిన సేవాధర్మనీతిని….  పాండవులు మౌనంగా, శ్రద్ధగా ఆలకించారు. విదురనీతి అంతా ధృతరాష్ట్రుడు విన్నదే. …విశ్వామిత్రుడి యాగసంరక్షణార్థం వెళ్లినప్పుడు రామలక్ష్మణులు మహర్షి ఉపదేశమంతా మౌనంగా వింటూ ఆయన్ని అనుసరించారు. శిష్యుడి అభ్యుదయానికి.. రాణించడానికి..  మౌనమే ఎంతో దోహదం చేస్తుందని అలాంటి వారి ద్వారా తెలుస్తోంది.

వానాకాలంలో కప్పలు బెకబెకమని అరుస్తాయి. పంచమ స్వరంలో మధురంగా పలికే కోయిల తనకిది సమయం కాదని మౌనంగా ఉండిపోతుంది. అలాగే మూర్ఖుల సభలో పండితుడైనవాడు మౌనంగానే ఉండిపోతాడు. అక్కడ మౌనమే పరమభూషణం.  పరిశోధనలో ప్రవచన్నాన్ని వినే సందర్భంలో విజ్ఞత గలవాడు మౌనంగానే ఉంటాడు.  మౌనం అలజడిని అశాంతిని అణచివేస్తుందంటారు  బాపూజీ. మౌనంగా చేసే ప్రార్థనకు ఎంతో శక్తి.. మహిమ ఉంటాయి. 

మౌనంగా ఉన్నప్పుడు చుట్టూ జరిగే విషయాలను, ఎదుటివారి అభిప్రాయాలను గమనించడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. ఇది కొత్త అవకాశాలను గుర్తించడానికి, సరైన నిర్ణయాలు తీసుకోవడానికి సహాయపడుతుంది. కొన్నిసార్లు మనం మాట్లాడకుండా మౌనంగా ఉండటం వలన మన శక్తిని కూడదీసుకోవచ్చు. ఇది ముఖ్యమైన విషయాలపై దృష్టి పెట్టడానికి, మరింత సమర్థవంతంగా పని చేయడానికి ఉపయోగపడుతుంది.

 మౌనం శ్వాసను తగ్గించి ఆయుష్షును పెంచుతుంది. మనిషికి మానసిక ఆరోగ్యం ప్రసాదిస్తుంది. ఆంతరిక శక్తిని వృద్ధిచేస్తుంది. ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది.  యోగసూత్రాల్లో మౌనానికి ఇచ్చిన ప్రాధాన్యం ప్రశంసనీయమైనది. రజస్తమోగుణాలను తగ్గించి .. మౌనం సత్వగుణాన్ని పెంపొందింపజేస్తుంది. ముక్తికి ప్రధాన సోపానం మౌనమేనని ఆధ్యాత్మిక వేత్తలు చెబుతున్నారు.   

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.