. 2 minutes

యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మరాఠా కోటలు

Caption of Image.

మరాఠా పాలకుల కాలం నాటి కోటలు ‘మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ ఆఫ్ ఇండియా’ యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో చోటుదక్కించుకున్నాయి. ఈ మేరకు పారిస్​లో జరిగిన 47వ ప్రపంచ వారసత్వ కమిటీ(డబ్ల్యూహెచ్​సీ) సదస్సులో నిర్ణయం తీసుకున్నారు. 2024–25 సంవత్సరానికిగాను భారత్ తరఫున మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ ఆఫ్ ఇండియాను ప్రపంచ వారసత్వ జాబితాలో చోటు కోసం  నామినేట్ చేశారు. ఈ కోటలను 17 నుంచి 19వ శతాబ్దాల మధ్య కాలంలో నిర్మించారు. 

ఇవి మరాఠా పాలకుల వ్యూహాత్మక సైనిక నైపుణ్యం, కోట నిర్మాణ శైలి, ఆ కాలం నాటి భౌగోళిక పరిస్థితులను సమర్థవంతంగా ఉపయోగించుకున్న విధానాన్ని ప్రతిబింబిస్తాయి. మరాఠా సామ్రాజ్యానికి చెందిన గొప్ప మిలిటరీ వ్యవస్థను, నిర్మాణ శైలిని ఈ కోటలు ప్రపంచానికి చాటిచెబుతాయి. ఇవి సహ్యాద్రి పర్వత శ్రేణులు, కొంకణ్​ తీరం, దక్కన్ పీఠభూమి, తూర్పు కనుమల్లో విస్తరించి ఉన్నాయి. యునెస్కో ప్రపంచ వారసత్వ జాబితాలో మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో విస్తరించి ఉన్న మొత్తం 12 కోటలు చోటుదక్కించుకున్నాయి.  

మహారాష్ట్ర: సాల్వర్​కోట, శివనేరికోట, లోహ్​గఢ్, ఖండేరికోట, రాయ్​గఢ్, రాజ్​గఢ్, ప్రతాప్​గఢ్, సువర్ణదుర్గ్, పన్హాలాకోట, విజయదుర్గ్, సింధు దుర్గ్​. 
తమిళనాడు: జింజికోట.
మరాఠా మిలిటరీ ల్యాండ్ స్కేప్స్ ఆఫ్ ఇండియాలో పలు రకాల కోటలు ఉన్నాయి. 
గిరి దుర్గాలు: సాల్వర్, శివనేరి, లోహగఢ్, రాయ్​గఢ్, రాజ్​గఢ్, జింజికోట.
గిరి– అటవీ దుర్గాలు: ప్రతాప్​గఢ్.
గిరి– పీఠభూమి దుర్గాలు: పన్హాలా.
తీర ప్రాంత దుర్గాలు: విజయదుర్గ్.
ద్వీప దుర్గాలు: ఖండేరి, సువర్ణదుర్గ్, సింధు దుర్గ్.
ఈ కోటల్లో చాలా వరకు ఆర్కియాలజికల్ సర్వే ఆఫ్​ ఇండియా(ఏఎస్ఐ) లేదా మహారాష్ట్ర ప్రభుత్వ పురావస్తు సంగ్రహాలయాల డైరెక్టరేట్ రక్షణలో ఉన్నాయి. 

యునెస్కో

యునైటెడ్ నేషన్స్ ఎడ్యుకేషనల్, సైంటిఫిక్ అండ్ కల్చరల్ ఆర్గనైజేషన్(యునెస్కో)ను 1945,  నవంబర్ 16న లండన్​లో స్థాపించారు. దీని ప్రధాన కార్యాలయం ఫ్రాన్స్ రాజధాని పారిస్​లో ఉన్నది. యునెస్కో ప్రధాన లక్ష్యం విద్య, విజ్ఞానం, సంస్కృతి, సమాచారం అండ్ కమ్యూనికేషన్ ద్వారా ప్రపంచ శాంతి భద్రతలను ప్రోత్సహించడం. ఇది ఐక్యరాజ్యసమితి చార్టర్ ప్రకారం న్యాయం, చట్టబద్ధమైన పాలన, మానవ హక్కులు, ప్రాథమిక స్వాతంత్ర్యం కోసం ప్రపంచవ్యాప్తంగా గౌరవాన్ని పెంపొందించడం ద్వారా ఈ లక్ష్యాలను సాధించడానికి ప్రయత్నిస్తుంది. 

ముఖ్యమైన విధులు

విద్య: ప్రపంచవ్యాప్తంగా నాణ్యమైన విద్యను అందరికీ అందుబాటులోకి తీసుకురావడం, అక్షరాస్యతను పెంపొందించడం, విద్యలో సమానత్వాన్ని సాధించడం, సుస్థిర అభివృద్ధి కోసం విద్యను ప్రోత్సహించడం.
సైన్స్: శాస్త్రీయ సహకారాన్ని ప్రోత్సహించడం, సుస్థిర అభివృద్ధికి శాస్త్రాన్ని ఉపయోగించడం, వాతావరణ మార్పు, నీటి నిర్వహణ, పర్యావరణ పరిరక్షణ వంటి కీలక సమస్యలపై పరిశోధన, సహకారాన్ని ప్రోత్సహించడం.
సంస్కృతి: ప్రపంచంలోని వివిధ సంస్కృతులను పరిరక్షించడం, ప్రోత్సహించడం, వాటి వైవిధ్యాన్ని గౌరవించడం. ఇందులో భౌతిక వారసత్వం(చారిత్రక కట్టడాలు, స్థలాలు), అభౌతిక వారసత్వం(సంప్రదాయాలు, నృత్యాలు, కథలు, సంగీతం) రెండూ ఉంటాయి. ప్రపంచ వారసత్వ ప్రదేశాలు గుర్తించడం ఇందులో ఒక ముఖ్యమైన భాగం.
సమాచారం, కమ్యూనికేషన్: సమాచార స్వేచ్ఛను ప్రోత్సహించడం, మీడియా అభివృద్ధికి మద్దతు ఇవ్వడం, డిజిటల్ విభజనను తగ్గించడం, జ్ఞాన సమాజాలను ప్రోత్సహించడం. 

ప్రపంచ వారసత్వ ప్రదేశాలు

ఇది యునెస్కో చేపట్టిన అత్యంత ప్రతిష్టాత్మకమైన కార్యక్రమాల్లో ఒకటి. ప్రపంచ వారసత్వ సదస్సు ద్వారా మానవాళికి అత్యంత ప్రాముఖ్యత కలిగిన సాంస్కృతిక, సహజ ప్రదేశాలను గుర్తించి, వాటిని సంరక్షించడం దీని లక్ష్యం. ఒక ప్రాంతాన్ని ప్రపంచ వారసత్వ ప్రదేశంగా ప్రకటించడం వల్ల ఆ ప్రాంతం అంతర్జాతీయ గుర్తింపు పొంది, దాని పరిరక్షణకు అంతర్జాతీయ సహాయం లభిస్తుంది. యునెస్కోలో 195 సభ్య దేశాలు, 12 అనుబంధ సభ్య దేశాలు ఉన్నాయి. ఈ సంస్థ కార్యకలాపాలను జనరల్ కాన్ఫరెన్స్, ఎగ్జిక్యూటివ్ బోర్డు, సెక్రటేరియట్ అనే మూడు ప్రధాన సంస్థలు నిర్వహిస్తాయి. 
 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.