. 2 minutes

బనకచర్ల కోసం ఏపీ రూ.82వేల కోట్ల అప్పుకు రెడీ

Caption of Image.

హైదరాబాద్, వెలుగు: పోలవరం ఇంకా పూర్తికాకముందే పోలవరం–బనకచర్ల (పీబీ) లింకు ప్రాజెక్టుపై ఏపీ ప్రభుత్వం హడావిడి చేస్తుండడం అనేక అనుమానాలకు తావిస్తున్నది. ఇప్పటికే రూ.10 లక్షల కోట్ల అప్పులపాలైన ఏపీ సర్కారు, బనకచర్ల కోసం మరో రూ. 82వేల కోట్ల అప్పు చేసేందుకు ఎందుకు తెగిస్తోందనే  ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. 

ఈ ప్రాజెక్టు ‘గోదావరి ట్రిబ్యునల్​అవార్డు’కు విరుద్ధమని, అసలు అక్కడ వరద జలాలే లేవని కేంద్ర సంస్థలు చెబుతున్నా.. ఈ ప్రాజెక్ట్​ మరో కాళేశ్వరంలా మారి, ఏపీ పాలిట తెల్ల ఏనుగు అవుతుందని అక్కడి ఇరిగేషన్​ఎక్స్‌‌‌‌పర్ట్స్, మేధావులు హెచ్చరిస్తున్నా బాబు సర్కార్‌‌‌‌‌‌‌‌ వెనక్కి తగ్గడం లేదు. దీని వెనుక అసలు కారణం వేరే ఉందనే వాదన వినిపిస్తున్నది. 

గతంలో తెలంగాణలో కాళేశ్వరం, పాలమూరు–రంగారెడ్డి లాంటి కీలక ప్రాజెక్టులతో పాటు అటు ఏపీలో రాయలసీమ లిఫ్ట్​ ఇరిగేషన్​ లాంటి భారీ ఇరిగేషన్ ​ప్రాజెక్టులు చేపట్టి లక్షల కోట్లు సంపాదించిన ఓ బడా కాంట్రాక్ట్​సంస్థే..  ఇప్పుడు ఈ బనకచర్ల ప్రాజెక్టునూ చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. 

అవసరమైతే తెలంగాణ ప్రభుత్వాన్ని ఒప్పిస్తానని సదరు కాంట్రాక్ట్​ సంస్థ ఆఫర్​ఇచ్చినట్లు అక్కడి అధికార, రాజకీయ, మేధావి వర్గాల్లో చర్చ జరుగుతున్నది. మొత్తమ్మీద 40,500 ఎకరాల వ్యవసాయ భూములు, 17 వేల ఎకరాల అటవీ భూములు సేకరించి, 18 గ్రామాలను ముంచి, 10 లిఫ్టులు పెట్టి,  నెలనెలా కరెంట్‌‌‌‌కు వేల కోట్లు ఖర్చు పెడ్తూ 575 కిలోమీటర్లకు గోదావరి నీళ్లు ఎత్తిపోయడం అసాధ్యమని, ఆ పేరుతో ఇన్‌‌‌‌ఫ్రాస్ట్రక్చర్​ డెవలప్​ చేసి, శ్రీశైలం నుంచి కృష్ణా నీటిని దోచుకెళ్లడమే ఏపీ పాలకుల అసలు లక్ష్యమని స్పష్టమవుతున్నది.

ALSO READ : బనకచర్ల ఏపీకి గుదిబండే..మేఘా కంపెనీ కోసమే అంటున్న ఏబీ వెంకటేశ్వరరావు

బీఆర్ఎస్​ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో అవలంబించిన విధానాలనే బనకచర్ల ప్రాజెక్టు విషయంలో ఫాలో అవ్వాలని ఏపీ సర్కారు భావిస్తోంది. 10 లిఫ్టులు, 38 కిలోమీటర్ల పొడవైన సొరంగాల ద్వారా 575 కిలోమీటర్ల దూరంలో ఉన్న బనకచర్ల క్రాస్​రెగ్యులేటర్‌‌‌‌‌‌‌‌కు గోదావరి నీళ్లను తరలించేలా పీబీ లింక్​ప్రాజెక్టును రూ.82 వేల కోట్లతో నిర్మించాలని ఏపీ నిర్ణయించింది. ఇది అంచనా మాత్రమే. 

ప్రాజెక్టు పూర్తయ్యే సరికి మొత్తం ఖర్చు రూ.లక్ష కోట్లు దాటనుంది. ఈ క్రమంలో ఇప్పటికే పోలవరం నుంచి ప్రకాశం బ్యారేజీ వరకు నీళ్లను తరలించే సెగ్మెంట్​1 పనులకు టెండర్లను పిలిచేందుకు ఏపీ సర్కారు రెడీ అవుతోంది.  పనిలో పనిగా సెగ్మెంట్​2 పనులను సైతం సమాంతరంగా చేసే అంశంపైనా కసరత్తు చేస్తోంది. కాగా,  కాళేశ్వరం ప్రాజెక్టులో కీలక పనులు దక్కించుకున్న ఓ బడా కాంట్రాక్ట్​సంస్థే బనకచర్ల మెయిన్​వర్క్స్​చేపట్టేందుకు ముందుకు వచ్చినట్లు తెలిసింది. 

రెండు రాష్ట్రాల్లో నాటి, నేటి ముఖ్యమంత్రులకు కావాల్సిన వ్యక్తిగా రంగంలోకి దిగిన సదరు కాంట్రాక్టర్.. ​ బనకచర్ల ప్రాజెక్టులోని కీలకమైన లిఫ్టులు, టన్నెల్స్ లాంటి పనులను తనకు అప్పగించేలా ఏపీ ప్రభుత్వ పెద్దలతో ఇప్పటికే అవగాహన కుదుర్చుకున్నట్లు సమాచారం. ఇందుకు ప్రతిగా బనకచర్లకు అడ్డుతగులుతున్న తెలంగాణ పెద్దలను ఒప్పిస్తాననే బంపర్ ​ఆఫర్​ కూడా ఇచ్చినట్లు తెలిసింది. 

అలాగే మిగిలిన పనులను కాళేశ్వరం ప్రాజెక్టులో మాదిరి కావాల్సిన వాళ్లకు నామి నేషన్‌‌‌‌పై ఇచ్చుకోవచ్చనే సలహా కూడా ఇచ్చినట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఆయా పనులకు సైతం ఏపీ ప్రభుత్వం కాంట్రాక్టర్ల లిస్టు సిద్ధం చేసి పెట్టుకున్నదని, దాదాపు రూ.50 వేల కోట్ల పనులను పప్పుబెల్లాల్లాగా పంచే ప్రయత్నాలు జరుగుతున్నాయనే చర్చ ఏపీ అధికార, రాజకీయ, మేధావి వర్గాల్లో జరుగుతోంది. 

కాళేశ్వరం ప్రాజెక్టులో దాదాపు 56 సబ్​కాంట్రాక్ట్​లను ఆనాటి బీఆర్ఎస్​ సర్కారు ఇచ్చిందని కాళేశ్వరం కమిషన్​ ఎంక్వైరీలో ఇప్పటికే తేలింది. ఇప్పుడు బనకచర్ల ప్రాజెక్ట్​ విషయంలోనూ అదే రీతిలో సబ్​కాంట్రాక్టుల దందాకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది.

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.