. 2 minutes

బనకచర్లపై ఏపీతో చర్చల్లేవ్..తెలంగాణ సర్కార్

Caption of Image.
  • ఆ అంశాన్ని ఎజెండా నుంచి తొలగించండి.. కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వం లేఖ 
  • ఆ ప్రాజెక్టుకు ఇంకా అనుమతులు రాలేదు
  • కేంద్ర సంస్థల అభ్యంతరాలకూ సమాధానం లేదు 
  • ఇలాంటి టైమ్‌‌లో చర్చించడం తొందరపాటే అవుతుంది
  • తెలంగాణ ఎజెండా అంశాలపైనే చర్చించాలని విజ్ఞప్తి
  • ఒకవేళ బనకచర్ల అంశాన్ని తొలగించకపోతే సీఎంల మీటింగ్‌‌ను వాకౌట్ చేసే యోచనలో రాష్ట్ర సర్కార్‌‌‌‌

హైదరాబాద్, వెలుగు: ఏపీ చేపట్టిన బనకచర్ల ప్రాజెక్టుపై ఆ రాష్ట్ర సీఎం చంద్రబాబు సమక్షంలో చర్చించేది లేదని రాష్ట్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. బుధవారం ఢిల్లీలో కేంద్ర జలశక్తి శాఖ మంత్రి సీఆర్ పాటిల్ నేతృత్వంలో నిర్వహించనున్న రెండు రాష్ట్రాల సీఎంల మీటింగ్​ఎజెండా నుంచి బనకచర్ల అంశాన్ని తొలగించాలని కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. 

ఏపీ ఇచ్చిన సింగిల్​ఎజెండా అంశం బనకచర్ల ఇంకా ప్రాథమిక దశలోనే ఉందని, ఇలాంటి సమయంలో దానిపై చర్చించాల్సిన అవసరం లేదని స్పష్టం చేసింది. తాము ఇచ్చిన అంశాలను ఎజెండాలో చేర్చి చర్చించాలని కోరింది. ఈ మేరకు కేంద్ర జలశక్తి శాఖకు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రామకృష్ణారావు సోమవారమే లేఖ రాశారు. 

పోలవరం బనకచర్ల లిఫ్ట్‌‌‌‌‌‌‌‌పై రాష్ట్ర ప్రభుత్వ స్టాండ్, ఆ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌పై ఉన్న అభ్యంతరాలను లేఖలో ప్రస్తావించారు. ఒకవేళ బనకచర్ల అంశాన్ని ఎజెండా నుంచి తొలగించకపోతే సమావేశాన్ని వాకౌట్​చేసే యోచనలో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు తెలిసింది. 

ఇవీ అభ్యంతరాలు..

బనకచర్ల ప్రాజెక్టుపై ఇప్పటికే ఎన్నోసార్లు తమ అభ్యంతరాలను తెలియజేశామని సీఎస్ ​లేఖలో పేర్కొన్నారు. నది పరీవాహక రాష్ట్రాలతో సంప్రదిం చకుండా నీటి వాటాలను ఏపీ ఆల్టరేషన్​ చేయాలనుకోవడం గోదావరి వాటర్​ డిస్ప్యూట్స్​ ట్రిబ్యునల్​అవార్డుకు, ఏపీ విభజన చట్ట నిబంధనలకు విరుద్ధమని తెలిపారు. ఇప్పటికీ ఆ ప్రాజెక్టుకు సీడబ్ల్యూసీ, గోదావరి బోర్డు, కృష్ణా బోర్డు, అపెక్స్​ కౌన్సిల్​అనుమతులు రాలేదని చెప్పారు. 

సాంకేతికంగా ప్రాజెక్టు సాధ్యాసాధ్యాలు, నీటి లభ్యతపై ఏపీ సమర్పించిన పీఎఫ్ఆర్​(ప్రీ ఫీజిబిలిటీ రిపోర్టు)లో అనేక లోపాలు ఉన్నాయన్నారు. ఇప్పటికే కేంద్ర పర్యావరణ శాఖ నేతృత్వంలోని ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్ అప్రైజ ల్ కమిటీ (ఈఏసీ) ఏపీ ప్రతిపాదనలను తిరస్కరించిందని గుర్తుచేశారు. పోలవరం ప్రాజెక్టు నుంచి 200 టీఎంసీల మళ్లింపు నిర్ణయం ఏకప క్షమని, దానివల్ల పోలవరం ప్రాజెక్ట్​ఆపరేషన్​షెడ్యూల్ ​మారిపోయి తెలంగాణ ప్రయోజనాలకు విఘాతం కలుగుతుందని పేర్కొన్నారు.

 ఇప్పటికే పోలవరం ప్రాజెక్ట్​ బ్యాక్ ​వాటర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో రాష్ట్రంలో కలిగే ముంపు సమస్యపై ఎటూ తేల్చడం లేదని, ఇలాంటి సమయంలో ఆ ప్రాజెక్ట్​ నుంచి బనకచర్ల లింక్‌‌‌‌‌‌‌‌ను ఎలా చేపడతారని ప్రశ్నించారు. ఈ ప్రాజెక్ట్‌‌‌‌‌‌‌‌తో గోదావరిలో తెలంగాణకు హక్కుగా రావాల్సిన వాటాల్లో నష్టం కలిగే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు.  

కేంద్ర సంస్థలూ అభ్యంతరం చెప్పినయ్​..

ఏపీ చేపట్టిన పీబీ లింక్ ​ప్రాజెక్టుపై కేంద్ర నియంత్రణ సంస్థలైన పోలవరం ప్రాజెక్ట్​ అథారిటీ (పీపీఏ), గోదావరి రివర్​ మేనేజ్‌‌‌‌‌‌‌‌మెంట్ ​బోర్డు (జీఆర్ఎంబీ), సెంట్రల్​ వాటర్​ కమిషన్​(సీడబ్ల్యూసీ), ఎక్స్‌‌‌‌‌‌‌‌పర్ట్​అప్రైజల్​కమిటీ (ఈఏసీ) అభ్యంతరం తెలిపాయని సీఎస్​ గుర్తుచేశారు. ‘‘పోలవరం ప్రాజెక్టు కోసం ఏపీ ఇప్పటికే సమర్పించిన డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌లో పీబీ లింక్ భాగం కాదని, పోలవరం పూర్తయ్యాకే పీబీ లింక్‌‌‌‌‌‌‌‌ను పరిశీలించాలని పీపీఏ సూచించింది. 

గోదావరి జలాల్లో రెండు రాష్ట్రాల మధ్య పరస్పర ఒప్పందాలేవీ జరగలేదని, 75 శాతం డిపెండబిలిటీ కింద 80 టీఎంసీలకన్నా ఎక్కువ తరలించే జలాలనూ అన్ని బేసిన్ ​రాష్ట్రాలకు పంచాల్సిన అవసరం ఉంటుందని జీఆర్ఎంబీ చెప్పింది. 

గోదావరిలో మిగులు జలాలు లేవని సీడబ్ల్యూసీ చెప్పింది. గోదావరి అవార్డుకు విరుద్ధంగా బనకచర్ల ప్రాజెక్టును చేపడుతున్నారంటూ ఈఏసీ కూడా ఏపీ పీఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను తిప్పి పంపింది. అంతర్రాష్ట్ర జల వివాదాల నేపథ్యంలో సీడబ్ల్యూసీ నుంచి అనుమతులు తీసుకోవాలని సూచించింది” అని లేఖలో వివరించారు. 

ఇప్పుడే చర్చిస్తే తొందరపాటే.. 

పీపీఏ, జీఆర్ఎంబీ, సీడబ్ల్యూసీ, ఈఏసీలు వ్యక్తం చేసిన అభ్యంతరాలపై ఇప్పటికీ ఇంకా ఎలాంటి పరిష్కారం లభించలేదని.. ఇలాంటి సమయంలో బనకచర్ల ప్రాజెక్టుపై చర్చించడం తొందరపాటే అవుతుందని లేఖలో సీఎస్​ పేర్కొన్నారు. 

‘‘ఒకవేళ కేంద్ర ప్రభుత్వం బనకచర్లపై చర్చిస్తే..  తన సొంత సంస్థల అభిప్రాయాలనే కేంద్రం పరిగణనలోకి తీసుకోవడం లేదని అభిప్రాయపడాల్సి వస్తుంది. ఆయా సంస్థలను తక్కువ చేసినట్టు అవుతుంది. 

కాబట్టి ఎజెండా నుంచి పోలవరం బనకచర్ల లింక్​ప్రాజెక్ట్​ అంశాన్ని తొలగించాలి. కృష్ణా జలాల్లో న్యాయమైన వాటాలు, గోదావరి, కృష్ణా నదులపై కట్టిన, కడుతున్న ప్రాజెక్టులకు అనుమతులు, తుమ్మిడిహెట్టిని ఏఐబీపీ కింద నిర్మించాలన్న తెలంగాణ విజ్ఞప్తులను పరిగణనలోకి తీసుకుని వాటిపై చర్చించాలి. ఇటు ఇచ్చంపల్లి వద్ద 200 టీఎంసీల వరద జలాల వినియోగానికి కొత్త ప్రాజె క్టు నిర్మాణం తదితర అంశాలపై చర్చించాలి” అని కోరారు.

ఇవీ విజ్ఞప్తులు..

పోలవరం బనకచర్ల లింక్​ ప్రాజెక్టుకు సంబంధించిన పీఎఫ్ఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను వెంటనే తిరస్కరించాలని సీడబ్ల్యూసీని ఆదేశించాలని కేంద్ర జలశక్తి శాఖకు ఇప్పటికే విజ్ఞప్తి చేశామని సీఎస్​ లేఖలో పేర్కొన్నారు. ‘‘బనకచర్ల డీపీఆర్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ను సమర్పించకుండా అడ్డుకోండి. ప్రాజెక్టు విషయంలో ఏపీ మరింత ముందుకు వెళ్లకుండా చూడండి.

 టెండర్లు పిలవకుండా అడ్డుకోండి. కేంద్ర సంస్థల నుంచి అనుమతులు వచ్చే వరకు.. గోదావరి పరీవాహక రాష్ట్రాలతో చర్చించేవరకు.. అభ్యంతరాలను పూర్తిగా పరిగణనలోకి తీసుకుని పరిష్కరించే వరకు ఈ ప్రాజెక్టుపై ఎలాంటి చర్చ గానీ, ఆమోదం గానీ తెలపవద్దు” అని కోరారు. 

©️ VIL Media Pvt Ltd.
Disclaimer : This story is auto aggrigated by a computer program and has not been created or edited by this website. All copyrights related to this news are owned by those websites. This website is not to be held responsible for any of the content displayed.